: బంగారం ఎగుమతులపై కేంద్రం నిషేధం.. ప్రభావం ఉండబోదన్న ఎగుమతిదారులు!
22 క్యారెట్ల కంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలు, ఇతర రూపంలో ఉన్న బంగారం ఎగుమతులపై కేంద్రం తాజాగా నిషేధం విధించింది. 8 నుంచి 22 క్యారెట్ల లోపు స్వచ్ఛత కలిగిన బంగారాన్ని మాత్రమే ఎగుమతి చేసేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షలకు అనుగుణంగా ఎగుమతులు చేసే వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై కొందరు పెదవి విరుస్తున్నారు. విదేశీ వాణిజ్య విధానాన్ని (2015-20) సవరించి అమలు పరచడం అయ్యే పనికాదని పేర్కొంటున్నారు.
బంగారం ప్రధాన దిగుమతిదారుగా ఉన్న భారత్‌లో ఇది అమలయ్యేది అంతంత మాత్రమేనని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వ్యాపారులు 22 క్యారెట్ల కంటే ఎక్కువ ఉన్న స్వచ్ఛత ఉన్న బంగారాన్ని దిగుమతి చేసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో ఎగుమతి, దిగుమతులపై పెద్దగా ప్రభావమేమీ ఉండదని భారత ఎగుమతిదారుల సమాఖ్య పేర్కొంది. కాగా, ఉత్తర కొరియా నుంచి పెద్ద ఎత్తున బంగారం దిగుమతులు పెరగడంతో దేశంలోని ఆభరణాల వ్యాపారులు ఆందోళన చేస్తున్న సమయంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.