: స్నాప్ డీల్ ట్వీట్ కు దీటైన సమాధానం చెప్పిన టాలీవుడ్ హీరో...అభినందించిన భార్య
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ స్నాప్ డీల్ ట్వీట్ కు టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ దీటైన సమాధానమిచ్చి నెటిజన్ల ప్రశంసలు పొందాడు. స్నాప్ డీల్ ప్రచారంలో భాగంగా మహిళల షాపింగ్ నుద్దేశించి ‘జజ్బా’ సినిమాలో ఐశ్వర్యరాయ్ పరుగెడుతున్న వీడియోను పోస్ట్ చేసి, దానితోపాటు ‘ఎంత షాపింగ్ చేసిందో భర్త తెలుసుకునే లోపే.. మహిళ ఇలా డోర్ దగ్గరకు పరిగెడుతుంది’ అన్న వ్యాఖ్యను జోడిస్తూ, ఇది మీకు వర్తిస్తుందా? అని వినియగదారులను ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
దీనికి రాహుల్ రవీంద్రన్ ఘాటుగా స్పందించాడు. ‘గతేడాది నా సంపాదన కన్నా నా భార్య సంపాదన ఎక్కువ. చెప్పాలంటే ఆమె నాకంటే ఎక్కువ పన్ను చెల్లిస్తోంది. ఆమె తన ఆన్ లైన్, ఇతర షాపింగ్ లకు తన డబ్బులే వాడుతుంది. ఆమె ఎక్కడికీ పరిగెత్తాల్సిన అవసరం లేదు’ అంటూ ఘాటు సమాధానం ఇచ్చాడు. దీనిపై అతని భార్య, ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద 'ఇలాంటి భర్తను ప్రతి అమ్మాయి కోరుకుంటుంది' అంటూ ట్వీట్ చేసి మురిసిపోయింది. దీనికి నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభించింది. స్నాప్ డీల్ పై మండిపడుతూ రాహుల్ రవీంద్రన్ ను పలువురు అభినందిస్తున్నారు.