: శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలకు ఏం చేశారని పవన్ ప్రశ్నించాలి!: జనసేనాని నిర్ణయంపై స్పందించిన భూమా మౌనికారెడ్డి
భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గంలో ఈ నెల 23న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు ఇస్తాడని పలువురు భావించిన విషయం తెలిసిందే. అయితే, తాను ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రకటించారు. పవన్ నిర్ణయంపై స్పందించిన భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికారెడ్డి ఈ రోజు మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఆయన అభిమానుల మద్దతు టీడీపీకే ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ రోజు పవన్ కల్యాణ్ చెప్పినదానితో తాను ఏకీభవిస్తున్నానని మౌనికారెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ ఇంకా విధివిధానాలు రూపొందించలేదని అన్నారు. దీంతో పవన్ మద్దతు తెలపలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, శిల్పా మోహన్ రెడ్డి తొమ్మిదేళ్లు మంత్రిగా ఉన్నారని, నంద్యాల ప్రజలకు ఆయన ఏం చేశారో పవన్ కల్యాణ్ ప్రశ్నించాలని అన్నారు. పవన్ ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని, తమ కుటుంబానిది కూడా అదే దృక్పథం అని అన్నారు.