: అబ్బాయిని కనాలని లేదు, కానీ, అమ్మాయికి జన్మనివ్వాలంటే భయంగా ఉంది: బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి
స్వాతంత్ర్య దినోత్సవం నాడే పంజాబ్ రాజధాని చండీగఢ్ లో ఓ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో జెండా వందనానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న బాలికపై ఈ దారుణం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళల భద్రతను ఉద్దేశించి హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి స్పందించింది. జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది.
‘‘భేటీ బచావో’ కార్యక్రమం ఏమైంది?. నాకు కుమారుడికి జన్మనివ్వాలని లేదు కానీ, ఈ పరిస్థితుల్లో అమ్మాయిని కనాలంటే మాత్రం భయంగా ఉంది. ‘స్వర్గం నుంచి నరకానికి ఎందుకు తీసుకొచ్చావు?’ అని రేపు ఒకవేళ మా అమ్మాయి నన్ను అడిగితే ఏం చెప్పను? క్రూరమైన నేరాలు చేసే వారిని ఎందుకు తీవ్రంగా శిక్షించరు? మళ్లీ అత్యాచారం! మనం ఏ స్వతంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం? దేశానికి మహిళలు ముఖ్యం కాదు అనుకునే రాజకీయ పార్టీలకు మహిళలు ఇకపై ఓట్లు వేయడాన్ని ఆపాలి... అసలు, మేము ఎందుకు ఓటు వేయాలి?... అన్ని పార్టీలు ఇప్పుడు నిద్రలేవాలి, ప్రతి మహిళ హక్కు భద్రత’ అని అన్నారు.