: ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రసారం చేశాం: డీడీ అగర్తలా
తన ప్రసంగాన్ని దూరదర్శన్ అగర్తలా వారు ప్రసారం చేయలేదని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ చేసిన ఆరోపణలను డీడీ అగర్తలా ఖండించింది. తాము ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రసారం చేశామని డీడీ అగర్తలా హెడ్ యూకే సాహూ తెలిపారు. రాష్ట్రంలో అధికారికంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకను 29 నిమిషాల 45 సెకన్ల పాటు ప్రసారం చేశామని, అందులో 12 నిమిషాల పాటు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రసారం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే కార్యక్రమం బుధవారం సాయంత్రం 4:45కు పునః ప్రసారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రసంగంలో తాము కోరిన విధంగా మార్పులు చేయకుంటే ప్రసంగాన్ని ప్రసారం చేయబోమని పేర్కొన్నామంటూ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ఆరోపణల్లో నిజం లేదని సాహూ స్పష్టం చేశారు.