: నిన్న కేసీఆర్ ఉద్యోగాలపై చేసిన ప్రకటన సరిగాలేదు: కోదండరామ్
త్వరలోనే పలు ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్... కేసీఆర్ ఉద్యోగాలపై చేసిన ప్రకటన సరిగా లేదని అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రైవేటు సంస్థల్లోనూ రిజర్వేషన్లు కల్పించి స్థానికులకు అవకాశం కల్పించాలని కోదండరామ్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన తాము ఇప్పుడు 1200 మంది అమరుల ఆశయాల సాధన కోసం పోరాడుతున్నామని అన్నారు. తెలంగాణ సర్కారు ఇసుక కాంట్రాక్టుల కోసం నేరెళ్లలో దాడులు చేయించిందని ఆరోపించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో కమీషన్లకు ఆశపడుతోందని అన్నారు.