: సాక్షి పత్రిక, టీవీ ఛానెల్ ఎవరివో ఆయనే చెప్పాలి: జగన్ పై బాలకృష్ణ ఫైర్
కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఈ రోజు కనాలలో తమ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేశారు. తనకు ఉన్న ఆస్తి ప్రజల్లో తనపై ఉన్న విశ్వాసమేనని, చంద్రబాబులా తనకు ప్రచారం చేసి పెట్టే మీడియా కూడా లేదని జగన్ అంటున్నారని బాలయ్య అన్నారు. సాక్షి వార్త పత్రిక, టీవీ ఛానెల్ ఎవరివో జగన్ చెప్పాలని బాలకృష్ణ నిలదీశారు.
తనకు మీడియా లేదని జగన్ అసత్య ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. అంతేగాక, ఆస్తులు కూడా లేవని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. సాక్షి పేపర్, టీవీ ఆస్తులను సీబీఐ, ఈడీ జప్తు చేశాయని, అవి జగన్‌కి చెందినవి కావా? అని బాలయ్య వ్యాఖ్యానించారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి విజయం సాధిస్తారని, భూమా నాగిరెడ్డికి అదే ఘన నివాళి అని బాలయ్య అన్నారు.