: హైదరాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్!
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా యోగితా రాణా నియమితులయ్యారు. ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆమెను హైదరాబాద్ కు బదిలీ చేశారు. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డికి కలెక్టర్ గా అదనపు బాధ్యతలను అప్పజెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి కలెక్టర్ గా ఇన్నాళ్లు అదనపు బాధ్యతలను నిర్వహించారు. మూడు నెలల తర్వాత హైదరాబాదుకు పూర్తి స్థాయి కలెక్టర్ నియమితులయ్యారు. యోగితా రాణా సమర్థవంతమైన అధికారిణిగా పేరొందారు. ఈ-నామ్ అమలులో జాతీయ పురస్కారం అందుకున్నారు. గత సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని చేతుల మీదుగా విశిష్టసేవ పురస్కారాన్ని అందుకున్నారు.