: నా కొడుకు సెంచరీ చేస్తాడని అస్సలు ఊహించలేదు: హార్దిక్ పాండ్యా తండ్రి
తన కొడుకు సెంచరీ చేస్తాడని అస్సలు ఊహించలేదని టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా అన్నారు. కెరీర్ లో మూడో టెస్టు ఆడుతున్న పాండ్యా పల్లెకెలలో శ్రీలంకతో జరిగిన చివరి టెస్ట్ లో సెంచరీతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 29 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన హార్దిక్ పాండ్యా ఆరు అర్ధ సెంచరీలు చేశాడని, అరంగేట్ర టెస్టులో కూడా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడని, చివరి టెస్టులో బాగా ఆడుతాడని ఊహించినా సెంచరీ చేస్తాడని మాత్రం ఊహించలేదని ఆయన తెలిపారు. అయితే తమ అంచనాలను తల్లకిందులు చేస్తూ పాండ్యా మూడో టెస్టులోనే సెంచరీ చేశాడని ఆయన మురిసిపోయారు. పాండ్యా ఆటతీరును తాము ఎంజాయ్ చేశామని చెప్పారు. సెంచరీ తరువాత ఇంట్లో పండగవాతావరణం ఏర్పడిందని ఆయన తెలిపారు. కాగా, కేవలం 86 బంతుల్లోనే సెంచరీ చేయడంతో హార్దిక్ పాండ్యా పై ప్రశంసలు కుస్తున్నాయి.