: అసలు చైనా నుంచి ఏం దిగుమతి అవుతున్నాయి?: లెక్కలు తేలుస్తున్న భారత్
దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ పెరుగుతూ, సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, చైనా నుంచి ఏ మేరకు ప్రోడక్టులు దిగుమతి అవుతున్నాయో తేల్చేందుకు కేంద్రం కదిలింది. భద్రతా పరమైన అంశాలతో పాటు డేటా లీకేజీలు నిండిన ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల ఇంపోర్ట్ పై లెక్కలు తీసే దిశగా సమీక్ష నిర్వహించింది. చైనా దిగుమతులను నిషేధించాలని, కుదరని పక్షంలో సుంకాలను భారీగా పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో డోక్లామ్ లో నెలకొన్న పరిస్థితులు, ఇరు దేశాల మధ్యా వ్యూహాత్మక వాణిజ్య బంధాలపైనా ప్రభావితం చూపుతున్న వేళ భారత్ ఈ రివ్యూను నిర్వహించడం గమనార్హం.
ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ లెక్కల ప్రకారం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనాకు చెందిన 22 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్టులున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు దూసుకెళుతున్నాయి. ఆన్ లైన్ వాణిజ్య మాధ్యమాల ద్వారా నిత్యమూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని చైనా కంపెనీలు పొందుతున్నాయి. చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద పెద్ద పరికరాల వరకూ ఎన్నో చైనాలో తయారైన వస్తువులు భారత మార్కెట్లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫోన్లతో పాటు వైద్య రంగంలో ఉపకరించే పరికరాలు, టెలికం నెట్ వర్క్ పరికరాలు, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైస్ లు ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి.
అసలు చైనా నుంచి వస్తున్న వస్తువులేంటన్న విషయాన్ని తేల్చేందుకు ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఇటీవల ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇండియాలో ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా చైనా ప్రొడక్టులకు చెక్ చెప్పవచ్చని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ఇది జరిగేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. ఇండియాలో అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లో సైతం చైనా కంపెనీలు చెప్పుకోతగ్గ వాటాలను కలిగివుండటం, డేటా సర్వర్లు చైనాలో ఉండటం దేశానికి ప్రమాదకరమన్న అభిప్రాయం కూడా ఈ రివ్యూ మీటింగ్ లో వెల్లడైంది. ఇక భారత ఐటీ ఇండస్ట్రీ ప్రస్తుతం 280 బిలియన్ డాలర్ల విలువను కలిగివుండగా, 2022 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో చైనా ప్రాతినిధ్యాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.