: నాకు సినిమా సీరియల్ అవకాశాలు రావేమో... కానీ వాళ్లకి మాత్రం శిక్షపడాలి: అత్యాచారయత్నం నుంచి బయటపడ్డ నటి
తనకు ఇకపై సీరియల్స్ లోను, సినిమాలలోను ఛాన్సులు రావేమోనని విజయవాడలో అత్యాచారయత్నాన్ని తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాదుకు చెందిన సదరు యువతి మాట్లాడుతూ, హైదరాబాదులో ఉంటూ సీరియళ్లలో నటిస్తున్నానని చెప్పింది. తమ సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తున్నామని తనకు చెప్పారని, వాస్తవానికి తాను రైలులో వెళ్లాల్సి ఉందని, అయితే డైరెక్టర్ చలపతి, హీరో సృజన్ కారు తీసుకురావాలని బలవంతం చేశారని చెప్పింది. వారి బలవంతంతో తప్పనిసరి పరిస్థితుల్లో కారు వేసుకుని రావాల్సి వచ్చిందని తెలిపింది. ముందు సీట్లో కూర్చున్న తనతో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో వెనుక సీట్ కు వెళ్లానని ఆమె చెప్పింది.
అక్కడ వారికి సహకరించలేదని, దీంతో తనపై దారుణంగా దాడి చేశారని తెలిపింది. తానెక్కడ కారులోంచి దూకేస్తానో అని డైరెక్టర్ చలపతి వేగంగా వెళ్తూ తన కారుతో ముందున్న లారీని గుద్దేశాడని ఆమె చెప్పింది. దీంతో తనను ఆసుపత్రిలో చేర్చారని, తన స్నేహితులు రావడంతో చికిత్స అనంతరం కోలుకున్నానని, అయితే నిర్మాతలు వచ్చి షూటింగ్ కోసం భీమవరం తీసుకెళ్లారని చెప్పింది. తన కారు గురించి అడగడంతో షూటింగ్ పూర్తయిన తరువాత కారు వస్తుందని చెబుతూ, బూతులు తిట్టారని చెప్పింది. జరిగిన దాని గురించి రాద్దాంతం చేస్తే నీ కెరీరే నాశనమవుతుందని వారు హెచ్చరించారని చెప్పింది. తనకు అవకాశాలు వచ్చినా, రాకపోయినా వారికి మాత్రం శిక్ష పడాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.