: బెంగళూరు అతలాకుతలం... 127 ఏళ్ల వర్షం రికార్డు బద్దలు... నీట మునిగిన వేలాది అపార్టుమెంట్లు!
గడచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా వరదనీరే కనిపిస్తోంది. ఐటీ కంపెనీలు అత్యధికంగా ఉండే కోరమంగళతో పాటు యలహంక తదితర ప్రాంతాల్లో వేలాది అపార్టుమెంట్లు నీట మునిగాయి. వందలాది వాహనాలు రోడ్లపై కదలక మొరాయించడంతో ట్రాఫిక్ గంటల కొద్దీ స్తంభించింది.
127 ఏళ్ల నాడు ఇంత భారీ వర్షం కురిసిందని, 1890, ఆగస్టు 27న 16 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఆపై మంగళవారం నాడు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వర్షం మంగళవారం సాయంత్రం వరకూ పడుతూనే ఉందని, తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో రాష్ట్ర డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ సిబ్బంది రంగంలోకి దిగారని అధికారులు తెలిపారు.
బైలికహళ్లి ప్రాంతంలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆహారం, మంచినీటిని అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని, కోరమంగళ ప్రాంతంలోని ఎస్టీ బెడ్ ఏరియాలో 40 రెస్క్యూ బోట్లతో నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తెస్తున్నామని తెలిపారు. జయనగర్, బెన్నార్ ఘట్ట రోడ్డు, రాజరాజేశ్వరీ నగర్, జేపీ నగర్, నాగభైరవి, ఉత్తర హళ్ళి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో వరద ప్రభావం అధికంగా ఉందని తెలిపారు.