: మోదీ కీలక నిర్ణయం... తీర రక్షణకు రూ. 32 వేల కోట్లు


వచ్చే ఐదు సంవత్సరాల వ్యవధిలో భారత తీర ప్రాంత రక్షక దళాన్ని మరింతగా విస్తరించేందుకు రూ. 31,748 కోట్లను కేటాయించాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్మీ, ఐఏఎఫ్, నేవీల తరువాత రక్షణ మంత్రిత్వ శాఖలో చిన్న విభాగంగా ఉన్న కోస్ట్ గార్డ్ దళానికి మరిన్ని పెట్రోలింగ్ బోట్లు, హెలికాప్టర్లు, విమానాలు, మౌలిక వసతులను కల్పించాలని రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా అధ్యక్షతన సమావేశమైన కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్ణయం తీసుకోగా, ఆ మేరకు మోదీ సర్కారు నిధులిచ్చేందుకు అంగీకరించింది. 2022 నాటికి 175 షిప్ లు, 110 ఎయిర్ క్రాఫ్ట్ ఫోర్స్ తో కోస్ట్ గార్డ్ దళాన్ని ఆధునికీకరించాలన్న లక్ష్యంతో ముందడుగు వేయనున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా, ఇండియాకు 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా, తీరానికి సమీపంలో 1,382 చిన్న చిన్న ద్వీపాలున్నాయి. తీరంలో 20 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎకనామిక్ జోన్లు నడుస్తున్నాయి. దీంతో తీర రక్షణ అత్యంత కీలకమైంది. ప్రస్తుతం కోస్ట్ గార్డ్స్ వద్ద 130 సర్ఫేస్ యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో ఆఫ్ షోర్ పెట్రోల్ వెసెల్స్, ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్, పొల్యూషన్ కంట్రోల్ వెసెల్స్ మొత్తం 60 వరకూ ఉండగా, 18 హోవర్ క్రాఫ్ట్ లు, 52 చిన్న ఇంటర్ సెప్టార్ బోట్లు, 39 డార్నియర్ విమానాలు, 19 చేతక్ హెలికాప్టర్, 4 ధ్రువ్ అడ్వాన్డ్స్ లైట్ హెలికాప్టర్లు ఉన్నాయి.

 ప్రస్తుతం తయారీదశలో 65 చిన్న షిప్ లు, బోట్లు ఉండగా, రూ. 5 వేల కోట్లతో 30 హెలికాప్టర్లను కొనుగోలు చేశామని, అవి డెలివరీ కానున్నాయని అధికారులు వెల్లడించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కు 16 దేశవాళీ ధ్రువ్ చాపర్ల కోసం ఆర్డర్ ఇచ్చామని, మరో 14 ట్విన్ ఇంజన్ ఈసీ-725 చాపర్లు ఎయిర్ బస్ అందించాల్సి వుందని తెలిపారు.

  • Loading...

More Telugu News