: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరిన 300 మంది ఒమన్ పెట్రోస్ గల్ఫ్ కంపెనీ కార్మికులు: తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఘనత
ఆరు నెలలుగా సరైన తిండి లేక, చేసేందుకు సరైన పని దొరక్క ఇబ్బందులు పడ్డ గల్ఫ్ బాధితులు ఎట్టకేలకు హైదరాబాదు చేరారు. ఒమన్ లోని ఒమన్ పెట్రోస్ గల్ఫ్ కంపెనీలో పని చేసేందుకు తెలంగాణకు చెందిన పలువురు కార్మికులు వెళ్లారు. వీరిలో స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్లున్నారు. 6 నెలలుగా కంపెనీ కార్మికులకు జీతాలివ్వడం లేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేక, చేసేందుకు పని లేక కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
ఈ నేపథ్యంలో తమ సమస్యను సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు వివరించడంతో అంతా కలిసి తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కలవడంతో వారు సమస్యను పరిష్కరించారు. బాధితులకు విమాన టికెట్లను తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడంతో భారత విదేశాంగ శాఖ సహాయంతో వారిని స్వదేశం చేర్చారు. కొద్ది సేపటి క్రితమే 300 మంది కార్మికులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.