: నంద్యాలపై నేడు నిర్ణయం తీసుకోనున్న పవన్ కల్యాణ్!
నంద్యాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలన్నవిషయమై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. నంద్యాలతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ మద్దతిచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై మధ్యాహ్నంలోగా పవన్ నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని సమాచారం.
కాగా, ఆయన ప్రస్తుతానికి తటస్థంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని జనసేనలోని ఓ వర్గం అభిప్రాయపడుతూ ఉండటం గమనార్హం. కాగా, ఉప ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతును పొందాలని భావించిన చంద్రబాబు, గత నెలాఖరులో ఆయనతో తన మనసులోని మాటను చెప్పిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా పలు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ వైఖరిని విమర్శించిన పవన్ కల్యాణ్, ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఆసక్తి నెలకొంది.