: వేతనానికే ప్రథమ ప్రాధాన్యం అంటున్న నవతరం ఉద్యోగులు... లింక్డ్ఇన్ సర్వేలో వెల్లడి
నవతరం యువత ఒక ఉద్యోగం చేసుకుంటూ మరో ఉద్యోగం గురించి ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని కొత్త ఉద్యోగంలో చేరేలా ప్రేరేపించేది కొత్త సంస్థ ఆఫర్ చేసే వేతనమే అని లింక్డ్ఇన్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో తెలింది. దేశంలో దాదాపు 91 శాతం మంది ఉద్యోగులు అధిక వేతనం ఇచ్చే సంస్థల్లోకి మారేందుకే మొగ్గు చూపుతున్నారని సర్వే వెల్లడించింది. ఏప్రిల్ 2017లో 539 మంది ఉద్యోగులను విచారించి లింక్డ్ఇన్ ఈ వివరాలను రాబట్టింది.
అలాగే ఇంటర్వ్యూలో తమకి ఇవ్వబోయే వేతనం వివరాలు తెలుసుకోవడానికి 37 శాతం మంది ఆశపడతారని, నైపుణ్యాలు పెంచుకోవడం కోసం 40 శాతం మంది ఉద్యోగం మారతారని, మంచి ఎదుగుదల అందించే ఉద్యోగాల కోసం 32 శాతం మంది ఆరాటపడుతున్నారని సర్వే తెలిపింది. అంతేకాకుండా 52 శాతం మంది ఉద్యోగంతో పాటు కంపెనీ కల్పించే అదనపు సౌకర్యాల ఆధారంగా, 45 శాతం మంది కంపెనీ పేరుప్రతిష్టల ఆధారంగా ఉద్యోగం మారేందుకు సిద్ధపడతారని తేలింది.
వీటితో పాటు ఇంటర్వ్యూకి వెళ్లేముందు అభ్యర్థులు ఎలాంటి కసరత్తు చేస్తారనే విషయాలపై కూడా సర్వే విచారణ చేపట్టింది. ఇందులో ఇంటర్వ్యూ చేయనున్న కంపెనీకి సంబంధించిన వివరాల కోసం 49 శాతం మంది కంపెనీ వెబ్సైట్ను, 47 శాతం మంది ఇంటర్నెట్ బ్లాగులను, 35 శాతం మంది సంబంధిత కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆశ్రయిస్తారని నివేదిక పేర్కొంది.