: షీటీమ్ మహిళా కానిస్టేబుల్ నెంబర్ ను పోర్న్ సైట్ లో పెట్టి వేధింపులకు దిగిన యువకుడు


హైదరాబాదులో ఈవ్‌ టీజర్ల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగే షీ టీమ్‌ లోని మహిళా కానిస్టేబుల్‌ ఎనిమిది నెలలుగా వేధింపులకు గురవుతున్నారు. వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని రాచకొండ షీ టీమ్‌ బృందం పట్టుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఎనిమిది నెలల క్రితం రంగారెడ్డి జిల్లా మంచాలలోని ప్రతిభా డిగ్రీ కాలేజీకి చెందిన యువతి తన ఫోన్ కు గుర్తు తెలియని నెంబర్ నుంచి అసభ్యకర సందేశాలు వస్తున్నాయని, ఆకతాయి నుంచి కాపాడాలని కోరుతూ రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్‌ కు మెసేజ్‌ పంపింది. దీంతో రంగంలోకి దిగిన ఏఎస్‌ఐ నరసింహ నేతృత్వంలోని షీ బృందం బాధిత యువతిని సంప్రదించగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా సమస్యను పరిష్కరించాలని కోరింది.

దీంతో షీ టీమ్ సభ్యురాలైన లేడీ కానిస్టేబుల్ నిందితుడి సెల్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, అప్పటి నుంచి ఆమె సెల్ కు నిందితుడు అసభ్య మెసేజ్ లు పంపించడం ప్రారంభించాడు. ఆరంభంలో పెద్దగా పట్టించుకోని కానిస్టేబుల్ వేధింపులు శ్రుతి మించడంతో జనవరి 23న ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు, షీటీమ్ మహిళా కానిస్టేబుల్‌ ను వేధించడం మాత్రం మానలేదు సరికదా, నెల రోజుల క్రితం ఆమె సెల్ నెంబర్ ను పోర్న్‌ వెబ్‌ సైట్‌ లో అప్‌ లోడ్‌ చేశాడు. దీంతో ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అభ్యంతరకరమైన కాల్స్ రావడం ఆరంభమైంది. దీంతో ఈ కేసును మరింత సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో వరంగల్‌ జిల్లా పరకాల మండలానికి చెందిన బి.నిఖిల్‌ కుమార్‌ ను వేధింపుల శాడిస్ట్ గా గుర్తించి అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News