: 20 అడుగులు తవ్వేశారు... సమాంతరంగా రంధ్రం వేసి చంద్రశేఖర్ ను బయటకు తీయడమే తరువాయి!
గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మిడివరంలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే సహాయక చర్యల్లో దిగిన గ్రామీణులు, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి చంద్రశేఖర్ పడిపోయిన ప్రదేశాన్ని గుర్తించారు. 20 అడుగుల లోతులో చందు ఉన్నాడని గుర్తిస్తే...అంత కంటే ఐదు అడుగుల లోతుకు ప్రొక్లైనర్ తో తవ్వించారు. అక్కడి నుంచి బోరు బావికి అనుసంధానంగా డ్రిల్లింగ్ మిషన్ తో రంధ్రం చేస్తున్నారు. ఇందు కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు గాలించి, క్వారీలో అత్యంత అనుభవం కలిగిన డ్రిల్లర్లను తీసుకొచ్చారు. వారితో రంధ్రం తవ్విస్తున్నారు.
బోరు రంధ్రం కనపడగానే అక్కడ చెక్కను అడ్డం పెడతారు. ఒకవేళ పొరపాటున బాబు కిందికి జారినా మరింత లోపలికి దిగిపోకుండా ఉండేందుకు అది సహాయపడుతుంది. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు తెచ్చిన రోబోటిక్ హ్యాండ్ తో బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. బాబు క్షేమంగా వస్తే ఇబ్బంది లేదని, ఒకవేళ అలా కాని పక్షంలో.. కింది నుంచి ప్రొక్లెయినర్ తో తవ్వుకుని వస్తూ బాబును రక్షిస్తారు. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. రోబోటిక్ హ్యాండ్ తో బాబు బయటకు వస్తే కనక మరో అరగంటలో ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. బాలుడ్ని బయటకు తీయగానే వైద్యసాయమందించేందుకు ప్రత్యేక వైద్య సిబ్బందితో 108 సిద్ధంగా ఉంది.