: బయటపడ్డ కిమ్ జాంగ్ ఉన్ ఫోటోలతో బెంబేలెత్తిపోతున్న గువాం ద్వీప వాసులు
గువాం ద్వీపంపై దాడికి దిగుతాం అంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చేసిన ప్రకటనలను అమెరికా తీవ్రంగా పరిగణించినప్పటికీ ప్రపంచ దేశాలకు మాత్రం కిమ్ అన్నంత పనీ చేస్తాడా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బయటపడ్డ ఫోటోలు అందరి అనుమానాలు తీర్చేశాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గువాం ద్వీపాన్ని లక్ష్యం చేసుకున్నారన్న వాస్తవం ఆ ఫోటోలను చూస్తే స్పష్టమవుతోంది. ఎందుకంటే కిమ్ కూర్చున్న రూంలో ఆయన వెనుక ఉన్న ఫోటోలన్నీ గువామ్ ద్వీపానికి సంబంధించినవి కావడం విశేషం. అంతేకాకుండా గువామ్ ద్వీప శాటిలైట్ చిత్రాలతో పాటు మరో ఫోటోలో ఒక స్కెచ్ గీసి ఉంది. జపాన్ మీదుగా గువామ్ వరకు ఓ రేఖను కిమ్ గీశారు.
ఆ రేఖను దాడి చేయడానికి ప్రయాణించాల్సిన మార్గంగా కిమ్ సూచించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తం నాలుగు క్షిపణులతో చారిత్రాత్మక దాడి చేయాలని ఆయన భావించారని, కానీ చివరి క్షణంలో నిలిపివేశారని ఈ ఫోటోలను విశ్లేషించిన నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తరకొరియాపై అమెరికా స్పందనలో ఏమాత్రం తేడా వచ్చినా దాడికి దిగాలని కిమ్ భావించారని అమెరికా అధికారులు సమర్పించిన నివేదిక చెబుతోంది. ఈ క్రమంలో గువాం ద్వీపంలోని అమెరికాకు చెందిన అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ శాటిలైట్ చిత్రం పక్కన కిమ్ జాంగ్ ఉన్ కూర్చున్న ఫోటో విడుదల కావడంతో అమెరికాలో ఆందోళన నెలకొంది.