: హాలీవుడ్ షూటింగ్‌లో ప్రమాదం.. మహిళా స్టంట్ మాస్టర్ మృతి!
హాలీవుడ్ మూవీ ‘డెడ్ పూల్’ పార్ట్ 2 షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. బ్రిటిష్ కొలంబియాలోని వాన్ కవర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద నిన్న ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరించారు. ఈ క్రమంలో మహిళా స్టంట్ మాస్టర్ ఎస్ జె హర్రిస్ రిహార్సల్స్ చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వేగంగా బైక్ నడుపుతూ అక్కడ ఉన్న సిగ్నల్ ను క్రాస్ చేసిన ఆమె, అక్కడే ఉన్న మలుపులను గమనించలేకపోయింది.
దీంతో, పక్కనే ఉన్న షా టవర్ లోని ఓ షాపింగ్ మాల్ తలుపులను బలంగా ఢీకొట్టిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, ఈ సంఘటనపై ఈ చిత్ర నటుడు ర్యాన్ రెనాల్డ్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. ‘ఈ రోజు, డెడ్ పూల్ షూటింగ్ లో చిత్ర యూనిట్ లోని ఒకరిని మేము పోగొట్టుకున్న బాధాకరమైన రోజు ఇది. ఈ సంఘటనతో మా గుండెలు పగిలిపోయాయి.. అప్పటిదాకా మాతో నవ్వుతూ ఉన్న స్టంట్ మాస్టర్ ప్రాణాలు విడిచింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని వాపోయాడు.