: రాజకీయం ఇప్పుడే మొదలైంది... నేనేంటో చూపిస్తా: శరద్ యాదవ్
తనకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ, 21 మందిని జనతాదళ్ (యు) నుంచి తొలగిస్తూ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయం ఇప్పుడే మొదలైందని, ముందు ముందు తానేంటో చూపిస్తానని అన్నారు. "రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నేను పర్యటించి వచ్చాను. వారు 21 మందిని తొలగించారు. నేను మిగతా జిల్లాలు, రాష్ట్రాల్లోనూ పర్యటిస్తాను. నన్ను కోరుకునే వారిని సస్పెండ్ చేస్తూ పోతుంటే, వారిని లెక్కపెట్టడానికి చేతి వేళ్లు నొప్పులు పుడతాయి" అని తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు.
జేడీ-యూ అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ విధించిన ఈ సస్పెన్షన్లు చెల్లవని అన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు తన వెంటే ఉన్నారని, నితీశ్ చర్యలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని హెచ్చరించారు. కాగా, బీజేపీతో చేతులు కలపడం ద్వారా ప్రజా తీర్పును ఆయన దుర్వినియోగపరిచారని శరద్ యాదవ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆఫీస్ బేరర్లలో 98 శాతం, ఎమ్మెల్యేల్లో 100 శాతం, రాష్ట్ర కమిటీల్లో 75 శాతం నితీశ్ కుమార్ వెంటే ఉన్నారని పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ త్యాగి వెల్లడించారు.