: కేవీపీ! వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పండి?: టీడీపీ నేత బుద్దా వెంకన్న
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేవీపీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అదే బాట పట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు కేవీపీ రామచంద్రరావు ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారు? అంటూ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేవీపీకి ఓ బహిరంగ లేఖ రాశారు.
జగన్ కేసులో సీబీఐ విచారణప్పుడు కేవీపీ పేరును పలువురు ప్రస్తావించారని, అయినప్పటికీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కేవీపీ పెద్ద కుమారుడు ఢిల్లీలో నివసిస్తున్నారని, ఆ ఇంటి అద్దె నెలకు రూ.4.5 లక్షలు అని, రెండో కుమారుడు దుబాయ్ లో వ్యాపారం పేరిట రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టి నష్టపోయారని.. ఈ విషయాలు వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో ఎదిగిన కేవీపీకి సీఎం చంద్రబాబును విమర్శించే హక్కు లేదని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని బుద్దా వెంకన్న అన్నారు.