: కొనసాగుతున్న వలసలు.. టీడీపీలో చేరిన ముమ్మడివరం వైసీపీ ఇన్ చార్జ్
టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ సాయి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో సాయి, ఆయనతో పాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఆ పార్టీలో చేరారు. చంద్రబాబు స్వయంగా కండువాలు కప్పి వారిని టీడీపీలోకి ఆహ్వానించారు. కాగా, 1987లో గాడిలంక సర్పంచ్ గా సాయి తన రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత డీసీసీ సభ్యుడిగా, 1996లో మరోమారు గాడిలంక సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2001లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ముమ్మిడివరం ఎంపీపీగా గెలిచారు. 2006లో గన్నవరం జెడ్పీటీసీగా (కాంగ్రెస్ తరపున) విజయం సాధించారు.
అయితే, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన సాయికి నిరాశ ఎదురైంది. దీంతో, ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. 2014లో వైసీపీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ పరాజయం మూటగట్టుకున్నారు. 2016 వరకు వైసీపీలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా పనిచేశారు. అయితే, అదనపు కో-ఆర్డినేటర్ పదవిలో పితాని బాలకృష్ణను నియమించడంతో ఇరు వర్గాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు సాయి టీడీపీలోకి మారాల్సి వచ్చింది.