: చంద్రబాబు నాయుడిని మరోసారి గెలిపిస్తే ఏమవుతుందో తెలుసా?: జగన్
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు గిరినాథ్ సెంటర్లో రోడ్ షో నిర్వహిస్తోన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల క్రితం స్వాతంత్ర్య దినోత్సవంనాడు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని అన్నారు. కర్నూలును స్మార్ట్‌సిటీ చేస్తానని, కర్నూలుకు ఎయిర్‌పోర్టు తెస్తానని ఎన్నో హామీలు కురిపించారని ఆయన అన్నారు. అందులో ఒక్కటైనా చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తిని మరోసారి ఎన్నికల్లో గెలిపిస్తే ఏమవుతుందో తెలుసా? అని జగన్ ప్రశ్నించారు.
ఇలా అసత్యపు హామీలు చేస్తేనే గెలుస్తామని భావించి, ప్రతి రాజకీయ నాయకుడూ ఇకపై ప్రతి ఇంటికీ ఒక మారుతీ కారు కొనిస్తానని అంటారని అన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వారు ప్రతి ఇంటికీ కేజీ బంగారాన్ని ఇస్తానని అంటారని చురకలంటించారు. ఇటువంటి రాజకీయ నాయకులని చొక్కా పట్టుకుని నిలదీయాలని, అప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందని అన్నారు.