: నేను అనుకున్నవన్నీ జరిగితే మళ్లీ పెళ్లి చేసుకుంటా: హీరోయిన్ అమలాపాల్
తాను అనుకున్నవన్నీ జరిగితే తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఇటీవలే విడాకులు తీసుకున్న తమిళ హీరోయిన్ అమలాపాల్ చెప్పింది. దర్శకుడు విజయ్ నుంచి ఆమె విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నా వైవాహిక జీవితంలో ఇబ్బందులే లేవని, సంతోషంగా గడిపానని చెప్పను. బాధలు పడ్డాను, నేను, నా మాజీ భర్త చాలా చేదు అనుభవాలను చవి చూశాం. మేమిద్దరం సినీ పరిశ్రమకు చెందిన వాళ్లం, సెలెబ్రిటీలం కావడంతో మా మధ్యలో చాలా మంది తలదూర్చారు.
దీనికితోడు, మీడియా కథనాలు.. ఆ కథనాలు మా నియంత్రణలో లేకుండా పోయాయి. ఈ విషయమే కాదు, మన నియంత్రణలో ఉండని విషయాలు చాలా ఉంటాయి.. జీవితం ఎప్పుడూ నిలకడగా, సవ్యంగా ఉండదు. ఈ క్రమంలో నేను మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేశా. విడాకుల ద్వారా నాకు ప్రశాంతత లభించింది. చాలా సంతోషంగా ఉన్నా’ను అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తన మాజీ భర్త విజయ్ మంచి వ్యక్తి అని కితాబిచ్చింది. మళ్లీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయమై ఆమెను ప్రశ్నించగా.. దీనికంటే ముందు తనను తాను ప్రేమించు కోవాలని, తన కెరీర్ పై దృష్టి పెట్టాలని, ఇవన్నీ జరిగాక తాను తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని అమలాపాల్ చెప్పింది.