: భారత్ - చైనా అన్నదమ్ములు.. ఒకరిని మరొకరు ఓడించలేరు!: దలైలామా
భారత్ - చైనా దేశాలు అన్నదమ్ముల్లా జీవించాలని, ఒకరిపై ఒకరు గెలవలేరని, ఇరు దేశాలు ఎప్పుడూ సోదరభావంతో మెలగాల్సి ఉంటుందని బౌద్ధుల ఆధ్యాత్మికవేత్త దలైలామా అన్నారు. `హిందీ-చినీ భాయ్ భాయ్` అని ఆయన నొక్కి చెప్పారు. `ప్రస్తుతం ఉన్న వివాద పరిస్థితుల్లో భారత్ గానీ, చైనా గానీ ఒకర్ని మరొకరు ఓడించడం సాధ్యం కాదు. రెండు దేశాలు మిలటరీ పరంగా చాలా బలంగా ఉన్నాయి` అని ఆయన తెలిపారు. సరిహద్దుకు సంబంధించి ఇరు దేశాల మధ్య కొన్ని వివాదాలు ఉండొచ్చని, అలాంటి వాటిని పట్టించుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ - `1951లో టిబెట్ స్వాతంత్ర్యం విషయంలో టిబెట్ స్థానిక ప్రభుత్వానికి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇవాళ అత్యధిక బౌద్ధ మతస్తులు ఉన్న దేశంగా చైనా మారింది. నా కంటే ముందు దలైలామాగా ఉన్న వ్యక్తి టిబెట్ ఆధ్యాత్మిక, రాజకీయ వ్యవహారాలు రెండూ చూసుకునేవారు. నేను 2011లో రాజకీయాన్ని పూర్తిగా వదిలేశాను` అన్నారు. ఇప్పటికీ చైనాలో ఉన్న బౌద్ధులు భారత్‌లోని నలందలో బుద్ధిజం బోధించిన విధానాలనే పాటిస్తున్నారని, వారందరికీ భారత్‌లో బౌద్ధక్షేత్రాలు సందర్శించే సదుపాయం కల్పించాలని దలైలామా కోరారు.