: గూగుల్ వాయిస్ సెర్చ్... ఇక ప్రాంతీయ భాషల్లో!
వాయిస్ ఆదేశాల ద్వారా గూగుల్‌ను ఆపరేట్ చేయడం ఇక మరింత సులభతరం కానుంది. ఈ సేవను అభివృద్ధి చేసే సూచనలో మరో 30 భాషలను గూగుల్ వారు అనుసంధానించారు. వీటిలో ఎనిమిది భారతీయ భాషలే. ఇప్పటివరకు ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే గూగుల్ వాయిస్ సెర్చ్ సేవలు అందుబాటులో ఉండేవి. ఇక నుంచి వీటితో పాటు ప్రాంతీయ భాషలైన బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా గూగుల్ వాయిస్ సెర్చ్ పనిచేయనుంది.
ఈ భాషలు ఆండ్రాయిడ్ ఫోన్లలోని గూగుల్ యాప్‌తో పాటు జీబోర్డు యాప్‌లోనూ పనిచేస్తాయని గూగుల్ తెలిపింది. ఈ సేవను ఉపయోగించుకోవాలంటే సెట్టింగ్స్‌లో వాయిస్ మెనూలో తమ ప్రాంతీయ భాషకు ఆప్షన్ మార్చుకోవాలి. త్వరలోనే ఈ సదుపాయాన్ని ఐఓఎస్ వినియోగదారులకు కూడా కల్పించనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ సదుపాయం కల్పించడం వల్ల మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని గూగుల్ అభిప్రాయపడింది.