: జియో ఉచిత ఫోన్ బుకింగ్స్ ప్రారంభం
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ ప్రకటించిన రిలయన్స్ జియో ఉచిత 4జీ ఫీచర్ ఫోన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆగస్టు 24 నుంచి డెలివరీ కానున్న ఫోన్ల ముందస్తు బుకింగ్స్ ఎంపిక చేసిన రిలయన్స్ స్టోర్లలో ఒకేసారి ప్రారంభమయ్యాయి. దశలవారీగా అన్ని స్టోర్లలోనూ బుకింగ్స్ తీసుకుంటామని సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ ఫోన్ కావాలంటే తొలుత రూ. 1500 డిపాజిట్ చేయాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. ఆపై మూడేళ్ల తరువాత ఆ డబ్బును రిలయన్స్ వెనక్కు ఇచ్చేస్తుంది.
ఇక ఈ ఫోన్ బుక్ చేసుకోవాలంటే జియో అధీకృత రిటెయిలర్ వద్దకు వెళ్లి, ఆధార్ కార్డు జిరాక్సును అందించాల్సి వుంటుంది. ఒక ఆధార్ కార్డు నంబర్ తో ఒక ఫోన్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఇక నేడు ఫోన్ కోసం ఆర్డర్ చేసే వారికి సెప్టెంబర్ 1 నుంచి 4 మధ్య డెలివరీ అందుతుందని జియో వర్గాలు వెల్లడించాయి. వారానికి 50 లక్షల యూనిట్లను డెలివరీ చేస్తామని సంస్థ వర్గాలు వెల్లడించాయి. కాగా, మై జియో యాప్ నుంచి ఆన్ లైన్ బుకింగ్స్ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి.