: పాక్ జైలు గోడలను బద్దలు కొట్టిన భారత పైలట్ల ‘ద గ్రేట్ ఇండియన్ ఎస్కేప్’ గాథ!
బాలీవుడ్ లో తరణ్ జీత్ సింగ్ తెరకెక్కిస్తున్న ‘ద గ్రేట్ ఇండియన్ ఎస్కేప్’ సినిమా చిత్రీకరణలోనే ఆసక్తి రేపుతోంది. ఈ కథ ఫ్లయింగ్ లెఫ్టినెంట్ దిలీప్ పారుల్కర్ (74) జీవితంలో చోటుచేసుకున్న అంశాల ఆధారంగా రూపొందడం విశేషం. 1968లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో విధులు నిర్వర్తిస్తున్న వేళ కమాండింగ్ ఆఫీసర్ ఎం.ఎస్.బవాతో మాట్లాడుతూ, ‘‘మేం శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి పోరాడతాం. ఒక్క తూటాతో మా విమానం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ నేను యుద్ధఖైదీగా శత్రువుల చేతికి చిక్కితే, తప్పించుకొని తీరుతా’’ అన్నారు. ఆయన ఈ మాట చెప్పిన మూడేళ్లకు అంటే 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలైంది.
అప్పటికి పారుల్కర్ కు 29 ఏళ్లు. 1971 డిసెంబర్ 10న సుఖోయ్-7 యుద్ధ విమానంతో పాక్ లోని రాడార్ కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు దూసుకెళ్లారు. ఇంతలో విమానాన్ని పాక్ సైన్యం పేల్చేసింది. దీంతో పారాచూట్ సాయంతో పారుల్కర్ కిందికి దిగి యుద్ధ ఖైదీగా పాక్ చేతికి చిక్కారు. ఆ సమయంలో పాక్ అధికారి ఒకరిని బందీగా చేసుకుని, అతని తలకు రివాల్వర్ గురి పెట్టి, తనను ఢిల్లీలో వదలాల్సిందిగా డిమాండ్ చేయాలని ఆయన అనుకున్నారు. కానీ ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నారు. అతనిని రావల్పిండికి సమీపంలోని ఒక జైలులో బంధించారు. అక్కడే భారత వైమానిక దళానికి చెందిన ఎం.ఎస్.గ్రేవాల్, హరీశ్ సిన్హ్ జీలు కూడా బందీలుగా ఉన్నారు. ఇది జరిగిన ఆరు రోజులకు యుద్ధం ముగిసింది.
దీంతో తమను స్వదేశానికి అప్పజెబుతారని భావించిన ఆ ముగ్గురూ మూడు నెలల పాటు మౌనంగా ఉండిపోయారు. అయితే తమ అంచనా తప్పడంతో తప్పించుకునేందుకు ప్లాన్ రచించారు. జైలులో పారిపోయేందుకు అనువుగా ఉన్న ఒక సెల్ లోకి ముగ్గురూ మారారు. అప్పటి నుంచి 18 అంగుళాల మందమున్న గోడను ప్రతి రాత్రి ఒక పదునైన వస్తువుతో తవ్వడం మొదలుపెట్టారు. రెండు నెలల తరువాత వారి వ్యూహం ఫలించింది. దీంతో 1972 ఆగస్టు 13న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పారుల్కర్, ఎం.ఎస్.గ్రేవాల్, హరీశ్ లు జైలు నుంచి బయటపడ్డారు.
పఠాన్ లు ధరించే సంప్రదాయ దుస్తులు ధరించి, నీరు, ఔషధాలు, ఎండు పళ్లు, 600 రూపాయలతో జైలుకు దూరంగా ఉన్న రోడ్డెక్కారు. 12 గంటలు ప్రయాణించి పెషావర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఐదారు చెక్ పోస్టులను జాగ్రత్తగా దాటుకుంటూ జామ్ రౌద్ చేరుకున్నారు. అయితే లాండీ కోటాల్ లో ఎప్పుడో మూసేసిన లాండీ ఖానా అనే రైల్వే స్టేషన్ కోసం అక్కడి వారిని వాకబు చేశారు. ఇదే వారు చేసిన అతిపెద్ద పొరపాటు. దీంతో వారి సమాచారం పోలీసులకు చేరడం, వారొచ్చి మళ్లీ ఆముగ్గుర్నీ పట్టుకోవడం జరిగిపోయింది.
మళ్లీ మూడునెలలు అదే జైలులో నరకం చూడడం జరిగింది. యుద్ధ ఖైదీలను అప్పగించాలన్న ఒప్పందంతో 1972 డిసెంబర్ 1న పాక్ వారిని భారత్ కు అప్పగించింది. అనంతరం పారుల్కర్ మళ్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. అప్పట్లో శత్రుదేశం నుంచి తప్పించుకుని పారిపోవడం మినహా మరొక ఆలోచన ఉండేది కాదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనే ఇప్పుడు బాలీవుడ్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది.