: రూ. లక్ష కోట్ల ఆంబీ వ్యాలీ వేలం ప్రారంభం... రూ. 37.39 కోట్ల నుంచి మొదలు!
ముంబై, పుణెల మధ్య సుందరమైన అడవుల మధ్య లోనావాలా ప్రాంతంలో 6,76,211 ఎకరాల విస్తీర్ణంలో సహారా గ్రూప్ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ హిల్ సిటీ టౌన్ షిప్ ఆంబీ వ్యాలీ వేలం ఈ ఉదయం ప్రారంభమైంది. సహారా గ్రూప్ ప్రజలకు చెల్లించాల్సిన బకాయిల కోసం ఈ వ్యాలీని వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. సుమారు రూ. లక్ష కోట్ల విలువైన ఆంబీ వ్యాలీ వేలంలో ప్రారంభ ధర రూ. 37.39 కోట్ల వద్ద ప్రారంభమైంది. ఈ వేలానికి అధికారిక లిక్విడేటర్ గా బాంబే హైకోర్టు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్టులో 1.67 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,700 కోట్లు) పెట్టుబడిగా పెట్టేందుకు మారిషస్ కు చెందిన ఇన్వెస్టర్ రాయల్ పార్ట్ నర్స్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ముందుకు రాగా, ఆ సంస్థతో డీల్ కుదుర్చుకుని, ఆ డబ్బును కోర్టుకు కట్టేందుకు తమకు సమయం ఇవ్వాలని సహారా గ్రూప్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటివరకూ వేలంను నిలిపివేయాలని కోరింది. అయితే, వేలంను ఆపేందుకు అంగీకరించని అత్యున్నత న్యాయస్థానం, షెడ్యూల్ ప్రకారం వేలం కొనసాగుతుందని, అయితే, సెప్టెంబర్ 7న జరిగే తదుపరి విచారణలోగా, చెల్లించాల్సిన రూ. 1,500 కోట్లను సెబీ - సహారా రిఫండ్ ఖాతాలో జమ చేస్తే, అందుకు తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. కాగా, వచ్చే నెల 16 వరకూ ఆంబీ వ్యాలీ వేలం కొనసాగనుంది.