: తమ పాప చనిపోయినా.. వైద్యం చేశారని కన్నీరుపెట్టుకున్న తండ్రి
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ బీఆర్డీ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక వారం రోజుల వ్యవధిలో 72 మంది చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటనపై మీడియాకు మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోతే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలపడంలోనూ వైద్యులు దారుణంగా ప్రవర్తించారు. తన పాపను కోల్పోయిన ఓ తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపి కన్నీరు పెట్టుకున్నాడు.
ఆ ఆసుపత్రికి తన కూతురు ఖుషీని ఈ నెల 10న తీసుకువచ్చానని, ఆక్సిజన్ అందక పాప చనిపోయిందని అన్నాడు. ఆ ఆస్పత్రి సిబ్బంది మాత్రం తన పాప మృతి చెందినట్లు తమకు చెప్పలేదని అన్నాడు. అంతమంది ఒకేసారి చనిపోయారని చెబితే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తాయని ఆసుపత్రి సిబ్బంది ఇలా ప్రవర్తించారని అన్నారు. తన పాపకు ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా నిలిపివేసి, అంబు పంప్ ఇచ్చి చేతితో నొక్కుతూ ఆక్సిజన్ అందేలా చూసుకోమని చెప్పి వైద్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నాడు.
అయితే, ఆమె శరీరమంతా చల్లగా మారిపోయిందని తాను గ్రహించినట్లు తెలిపాడు. ఆసుపత్రి బయట మీడియా సిబ్బంది ఉండటంతో చనిపోయిన తన పాపకు వైద్యం చేస్తున్నట్లు వైద్యులు నటించారని అన్నారు. తన కూతురు 6 గంటలకు చనిపోతే, ఆసుపత్రి నుంచి అందరూ వెళ్లిపోయాక 10 గంటలకు ఆమె చనిపోయినట్లు తెలిపినట్లు ఆ తండ్రి చెప్పాడు. తన కూతురిని డాక్టర్ చేయాలనుకున్న తన ఆశలన్నీ నీరుగారిపోయానని అన్నాడు. మరికొంత మంది తల్లిదండ్రులతో కూడా వైద్యులు ఇలాగే ప్రవర్తించినట్లు తెలిసింది.