: కూతురి ప్రాణాలు పణంగా ఫోటో షూట్... తండ్రికి మూడేళ్ల జైలు!
అందంగా కనిపించే తన కుమార్తెను మరింత అందంగా చూపించాలని భావించిన ఓ తండ్రి, పాప ప్రాణాలను పణంగా పెడుతూ ఫోటో షూట్ ను నిర్వహించి జైలు పాలయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, రష్యాలోని సైబీరియాకు చెందిన రోమన్ అఫనసేవ్ (31) తన కుమార్తెను ఓ భవంతిపై నుంచి తలకిందులుగా వేలాడదీసి, ఒంటి చేత్తో పట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరో వీడియోను పోస్టు చేశాడు. దీనిలో బీఎండబ్ల్యూ స్పోర్ట్ కారు విండో బయట తన కుమార్తెను ఒంటి చేత్తో పట్టుకుని, కారును శరవేగంగా నడిపించాడు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేయగా, న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ఇక తాను పూర్తి నియంత్రణలోనే ఈ పని చేశానని, తన చర్యలతో తన బిడ్డ ప్రాణాలకు రిస్క్ ఎంతమాత్రమూ లేదని అఫనసేవ్ చెబుతుండటం గమనార్హం.