: మంత్రగత్తెగా అనుమానించి... నగ్నంగా మార్చి, మలం తినిపించి, మహిళను దారుణంగా హింసించి చంపిన బంధువులు!
తమ బంధువైన 40 సంవత్సరాల మహిళను మంత్రగత్తెగా అనుమానించి దారుణంగా హింసించి, కొట్టి చంపిన ఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో సంచలనం కలిగించింది. జైపూర్ కు 135 కిలోమీటర్ల దూరంలోని కేక్రీ అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కన్యాదేవి అనే మహిళను మంత్రగత్తె అనే నెపంతో, నగ్నంగా మార్చి, మలం తినిపించి, చిత్ర హింసలు పెట్టి, చంపారని అజ్మీర్ ఎస్పీ రాజేంద్ర సింగ్ వెల్లడించారు.
ఈ సంఘటనలో ఆమె బంధువులు పింకీ, సోనియా, మహావీర్, చంద్ర ప్రకాష్ రాయ్ గార్ లపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టామని వెల్లడించారు. ఘటనాస్థలిలోనే తీవ్రగాయాలతో కన్యాదేవి మరణించిందని తెలిపారు. చంపేసే ముందు ఆమె కళ్లను ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్డుతో బంధువులు పెకిలించారని, ఆపై మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేసినందున పోస్టుమార్టం చేయలేకపోయామని పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణలో భాగంగా నిందితులతో తాము అసలు విషయాన్ని చెప్పించామని అన్నారు. మృతురాలి భర్త నెల రోజుల క్రితం మరణించాడని, ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు.