: సోనియా సంచలన నిర్ణయం... రాహుల్ బదులు ప్రియాంక... సీనియర్ నేతలకు స్పష్టం చేసిన అధినేత్రి?
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీని నేడో రేపో నియమిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ, ఆయన కన్నా, ప్రియాంకా గాంధీ అయితే బాగుంటుందని సోనియా అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె కొందరు సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.
క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కాగా, మన్మోహన్ సింగ్ తదితర పెద్దల ముందు సోనియా స్వయంగా ప్రియాంకా పేరు ఎత్తినట్టు తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తావన ఆమె నోటి నుంచి రాగా, సీనియర్ నేతలు ఆశ్చర్యపోయారని, తుది నిర్ణయం తీసుకోకున్నా, రాహుల్ కన్నా ప్రియాంకా గాంధీ అయితే, పార్టీకి మేలు కలుగుతుందన్న అభిప్రాయం ఆమెలో వ్యక్తమైందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని చాలా కాలంగా భావిస్తున్న సోనియా, మరో ఒకటి రెండు నెలల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా, ప్రియాంక ప్రస్తావనను ఆమె మామూలుగానే తీసుకొచ్చారని, ఆమె మనసులో మాత్రం ఏదో బలంగానే ఉందని తమకు అనిపించిందని, ఈ ఎత్తుగడ వెనుక ఎంతో ఆలోచనను ఆమె చేసి వుండవచ్చని ఓ సీడబ్ల్యూసీ సభ్యుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నో సంవత్సరాలుగా ప్రియాంకకు పార్టీలో కీలక పదవిని ఇవ్వాలని డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రియాంక మాత్రం రాజకీయాల పరంగా తన తల్లి, సోదరుడి నియోజకవర్గాలైన అమేథి, రాయ్ బరేలీలపైనే దృష్టిని సారించి వున్నారు.