: 'అత్యాచారం చేశాడు, న్యాయం చేయండి బాబూ' అని వెళ్తే.. 2,000 ఇచ్చి వైద్యం చేయించుకోమన్న పంచాయతీ పెద్ద!
'అత్యాచారానికి పాల్పడ్డాడు, న్యాయం చేయండి బాబూ' అని పంచాయతీ పెద్దల దగ్గర మొరపెట్టుకుంటే రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి, ఆసుపత్రిలో చూపించు అంటూ సలహా ఇచ్చిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామ పంచాయతీ పరిధిలోని మోతీలాల్ తండాకు చెందిన బాలిక (14) ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఈ నెల 11న పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన గోపాల్ మార్గమధ్యంలో ఆమెను ఆపి, ఇంటిదగ్గర దించేస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు.
అనంతరం దగ్గర్లోని అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, అటునుంచి అటే పారిపోయాడు. ఎలాగోలా రాత్రికి ఇంటికి చేరిన బాలిక తల్లిదండ్రులకు జరిగిన దారుణం గురించి వివరించింది. దీంతో వెంటనే వారు గ్రామ సర్పంచ్ కు విషయం వివరించడంతో శనివారం పంచాయతీ నిర్వహించాడు. రెండు కుటుంబాలను పిలిచిన సర్పంచ్ నిందితుడ్ని పిలిపించి, 2,000 రూపాయల జరిమానా విధించి, వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో బాలిక తల్లి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గోపాల్, సర్పంచ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.