: నాలుగు రోజుల పాటు వర్షాలే... 16, 17న భారీ వర్షాలు!
తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని, ఆపై 16, 17 తేదీల్లో ఆవర్తనం మరింతగా విస్తరించి, రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు మరింత ప్రయోజనం కలుగుతుందని, ముఖ్యంగా పత్తి, కంది, మొక్కజొన్న, సోయా తదితర పంటలకు నీరందుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
కాగా, ఆగస్టులో ఇప్పటివరకూ సగటుతో పోలిస్తే 36 శాతం లోటు నమోదైంది. కాగా, నిన్న హైదరాబాద్ లో 4 సెంటీమీటర్లు, బోధ్ లో 3 సెంటీమీటర్లు, సంగారెడ్డి, ఉట్నూరు తదితర ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా పలు మండలాల్లో కరవు పరిస్థితే నెలకొని ఉందని, జూలైలో 24.2సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి వుండగా, చాలా ప్రాంతాల్లో సగటున 5.8 సెం.మీ మాత్రమే కురిసిందని అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం 584 మండలాలు ఉండగా, 236 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.