: సరికొత్త విషయాలు వెల్లడించిన ఉత్తరకొరియా టీవీ... అమెరికాపై యుద్ధానికి 30 లక్షల మంది?
అమెరికా - ఉత్తర కొరియా మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రెండు దేశాల నేతలు ఆందోళనలు పెంచుకుంటూపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫసిఫిక్ మహా సముద్రంలోని గువామ్ దీవిపై క్షిపణి దాడి చేస్తామని ఉత్తరకొరియా స్పష్టంగా ప్రకటించగానే... ప్రపంచ పటం నుంచి ఉత్తరకొరియాను లేకుండా చేసేస్తామని అమెరికా ప్రతి హెచ్చరిక చేసింది. ఈ మేరకు తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని, తమ ఆయుధాల్లో మందుగుండు సామగ్రి నింపి ఉంచామని అమెరికా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా టీవీ ఛానెల్ ఒకటి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ట్రంప్ హెచ్చరికలను కిమ్ జాంగ్ ఉన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిపింది. అందుకే మరో క్షిపణి ప్రయోగానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిపింది. జలాంతర్గామి ఆధారిత బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేపట్టనున్నామని కిమ్ ప్రకటించినట్టు ఆ టీవీ ఛానెల్ తెలిపింది. అంతే కాకుండా అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు 30 లక్షల మంది ఉత్తరకొరియన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని కూడా తెలిపింది.