: తడబడిన అడుగు...అథ్లెటిక్స్ ప్రపంచానికి షాక్... పతకం లేకుండానే కెరీర్ ముగించిన బోల్ట్!
ఉసేన్ బోల్ట్ పేరు చెప్పగానే ఎంతో ఉద్వేగం...కన్ను మూసి తెరిచేంతలో లక్ష్యాన్ని చేరే వేగం. ఎన్నో రికార్డులు, రివార్డులు, అవార్డులు అతని సొంతం. పరుగుల రాజుగా, జమైకా చిరుతగా పేరొందిన ఉసేన్ బోల్ట్ అభిమానులందర్నీ నిరాశకు గురి చేశాడు. చివరి రేసును లక్ష్యం చేరకుండానే గాయంతో ముగించాడు. దీంతో యావత్ అథ్లెటిక్ ప్రపంచం బావురు మంది. గాయం బారిన పడిన బోల్ట్ నిస్సహాయంగా ట్రాక్ పై పడిపోగా, మైదానంలోనూ, టీవీల ముందు కూర్చున్న అభిమానుల కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 40 నిమిషాలకు 400 మీటర్ల రిలే రేసు ప్రారంభం కాగా, చిజిండు ఉజా, అడమ్ జెమిలి, డానియెల్ టాల్ బోట్, నెథనీల్, మిచెల్ బ్లేక్ లతో కూడిన బ్రిటన్ (37.47 సెకన్లు) జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
దాని తరువాతి స్థానంలో రోడ్జర్స్, గాట్లిన్, బాకన్, కోల్మన్ తో కూడిన అమెరికా (37.52 సెకన్లు) జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది, జపాన్ (38.04 సెకన్లు) బృందం కాంస్య పతకంతో సత్తా చాటింది. ఈ దశలో ట్రాక్ పై కుప్పకూలిన బోల్ట్ ను సహచరులు మెక్ లీడ్, జులియన్ ఫోర్ట్, బ్లేక్ లు ఊరడిస్తూ, ట్రాక్ పై అతని వెన్నంటే నడిచి వీడ్కోలు పలికించారు. ఈ ఘటన యావత్ క్రీడాభిమానులను వేదనకు గురి చేసింది. బోల్ట్ కెరీర్ లో తొలిసారి రేసు ముగించకుండా ట్రాక్ నుంచి నిష్క్రమించగా, రేసు పూర్తి చేయకుండానే కెరీర్ ను ముగించాడు.