: చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ విషయంపై నిలదీయండి: నంద్యాలలో జగన్
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఈ రోజు గుడిపాటిగడ్డలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన ఒక్కమాట మీద కూడా నిలబడబోరని అన్నారు. నంద్యాల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్ తో పాటు ఏపీ మంత్రులందరూ నంద్యాలలోనే కనపడుతున్నారని అన్నారు. అభివృద్ధి చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఓ విషయాన్ని నిలదీయాలని జగన్ అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో కాస్త చెప్పమని చంద్రబాబుని అడగాలని ఆయన అన్నారు.
రోడ్డు విస్తరణ కోసం రోడ్డు పక్కన ఉన్న ఇళ్లని కూల్చేయడం అభివృద్ధా? అని అడగండని జగన్ అన్నారు. మూడున్నరేళ్లు నంద్యాలలో రోడ్డు విస్తరణ గురించి పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఆ పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం కూడా సరిగా అందించడం లేదని అన్నారు. ప్రతి సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అన్ని సామాజిక వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకి ప్రజలు గుర్తుకొచ్చారని, ఎన్నో హామీలు గుప్పిస్తున్నారని అన్నారు.