: సీఎంని కాల్చి చంపండని జగన్ అంటున్నారు.. ఇలాగేనా మాట్లాడేది?: ఏపీసీసీ అధ్యక్షుడు
నంద్యాల ఉప ఎన్నిక దగ్గరపడుతుండడంతో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌ను గెలిపించాలని కోరుతూ నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు పాదయాత్ర చేశారు. ఇందులో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, నంద్యాల కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... టీడీపీ, వైసీపీలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, జగన్‌లకి అధికార దాహం ఉందని అన్నారు.
జగన్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉందని, అయితే దేనిపై పోరాడాలో అది పక్కనపెట్టి 2019లో తమను గెలిపిస్తే నవరత్నాలు అంటూ వ్యాఖ్యలు చేస్తోందని రఘువీరారెడ్డి విమర్శించారు. వైసీపీ సమస్యలపై అస్సలు పోరాడడం లేదని అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్ష పార్టీ లేనట్లు ఉందని అన్నారు. వైసీపీ కనీసం తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోయిందని అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రత్యేక హోదా అనే ఊసే ఎత్తడం లేదని అన్నారు. ప్రభుత్వం అందిస్తోన్న పింఛన్ తీసుకోవాలన్నా, నంద్యాలలో వేసిన రోడ్లపై తిరగాలన్నా తనకు ఓటు వేయాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని రఘువీరారెడ్డి అన్నారు. మరోవైపు జగన్ సీఎంని కాల్చి చంపండి అని అంటున్నారని అన్నారు. నేతలు ఇలాగేనా మాట్లాడేదని రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నేతల తీరును గమనిస్తున్నారని అన్నారు.