: గోరఖ్ పూర్ లో మెదడు వాపు వ్యాధిపై 1996 నుంచే పోరాడుతున్నా: యోగి ఆదిత్యనాథ్
79 మంది చిన్నారుల మరణానికి కేంద్రమైన గోరఖ్ పూర్ బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) ఆస్పత్రిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాతో కలసి ఈ రోజు సందర్శించారు. అనంతరం యోగి మీడియాతో మాట్లాడారు. గోరఖ్ పూర్ లో తీవ్రంగా ఉన్న ఎన్ సెఫలైటిస్ (మెదడువాపు) పై తాను 1996-97 నుంచే పోరాడుతున్నట్టు యోగి చెప్పారు. 90 లక్షల మందికిపైగా చిన్నారులకు ఎన్ సెఫలైటిస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్టు చెప్పారు.
ఈ చిన్నారుల పట్ల తన కంటే శ్రద్ధ చూపిన వారు మరెవరూ లేరన్నారు. కేంద్రం అన్ని విధాలుగా ఈ విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మోదీ చెప్పారని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సైతం ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఓ వైద్య బృందం కూడా ఇక్కడికి వచ్చిందని తెలిపారు. ఈ ఘనటపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.