: హోండా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు హీరో మోటోకార్ప్ ప్రణాళికలు... మరో మూడు స్కూటర్ల ఆవిష్కరణకు సన్నాహాలు
హీరో మోటోకార్ప్, హోండా ఈ రెండూ గతంలో భాగస్వాములు. హీరో హోండా పేరుతో ద్విచక్ర వాహన మార్కెట్ ను శాసించాయి. ఆ తర్వాత రెండూ విడిపోయి ఒంటరి ప్రయాణాన్ని ఆరంభించాయి. ఇప్పటికీ టూ వీలర్ మార్కెట్లో హీరో మోటో కార్ప్ నంబర్ 1 గా ఉంది. కానీ, స్కూటర్ల విభాగంలో ఈ స్థానం హోండాకే చెందుతుంది. యాక్టివా మోడల్ ఒక్కటీ హోండాను తిరుగులేని స్థానంలో నిలబెట్టింది.
దీంతో ఈ విభాగంలోనూ తాను మొదటి స్థానానికి చేరుకోవాలని హీరో మోటోకార్ప్ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా వచ్చే మార్చిలోపు 125సీసీ సామర్థ్యంగల ఓ స్కూటర్ ను విడుదల చేయనుంది. మరో రెండు మోడళ్లను వచ్చే మార్చి తర్వాత అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న కంపెనీ వర్గాలు ఈ వివరాల్ని వెల్లడించాయి. ఇక మోటార్ సైకిళ్ల విభాగంలోనూ తన ఉత్పత్తుల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉంది. 200సీసీ మోటార్ సైకిల్ ను వచ్చే ఏడాది మార్చిలోపు ఆవిష్కరించనుంది.