: అమెరికా దిశగా క్షిపణులను సిద్ధం చేస్తున్న ఉత్తరకొరియా సైనిక సిబ్బంది... కింగ్ జాంగ్ ఆదేశిస్తే మరుక్షణమే ఫైర్
అగ్రరాజ్యం అమెరికానే కాదు, చాలా దేశాలకు ఉత్తరకొరియా కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దేశాధినేత కింగ్ జాంగ్ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో కనీసం ఉత్తరకొరియా సైన్యాధికారులకు కూడా అంతుబట్టడం లేదు. అమెరికా అధీనంలోని గువామ్ పైకి క్షిపణులు విడిచిపెడతామని కింగ్ జాంగ్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన మేరకు ఉత్తరకొరియా కిపణి నిర్వహణ విభాగం సన్నాహాలు కూడా మొదలు పెట్టేసింది. వచ్చే వారం నాటికి క్షిపణుల పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతాయి. ఆ తర్వాత జాంగ్ నిర్ణయం కోసం వేచి చూడడమే వీరు చేసే పని.
మరి కింగ్ జాంగ్ నిజంగానే అమెరికా భూ భాగంపైకి క్షిపణి దాడి చేయాలంటూ ఆదేశిస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కానీ, ఈ విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. ఉత్తరకొరియా ప్రజలు మాత్రం కింగ్ జాంగ్ అధికారాన్ని కోరుకుంటున్నట్టు ఉత్తరకొరియా లీడర్ షిప్ వాచ్ వెబ్ సైట్ నిర్వాహకుడు మైకేల్ మడెన్ అంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కింగ్ తనను తాను నిరూపించుకునే అవకాశాలను ఆయన కొట్టేయలేదు. వచ్చే మంగళవారం ఉత్తరకొరియా అవతరణ దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ నెల 21 దక్షిణ కొరియా, అమెరికా వార్షిక సైనిక విన్యాసాలు జరగనున్నాయి. ఈ రెండు సందర్భాల్లో ఏదో ఒక సమయంలో గువాంగ్ మీద ఉత్తరకొరియా క్షిపణి దాడి చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.