: నా నుంచి అమ్మ ప్రేమను పొందండి... అన్నాడీఏంకే శ్రేణులకు శశికళ లేఖ
అన్నాడీఎంకే శ్రేణులను తనవైపు తిప్పుకునేందుకు వీకే శశికళ ప్రయత్నించారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సహచరిణి అయిన శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులో జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ఆమె జైలుకెళ్లిన తర్వాత సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఒక్కటవబోతున్న నేపథ్యంలో శశికళ తాజాగా అన్నాడీఎంకే పార్టీ వర్గాలకు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీని, తమిళనాడును ప్రతిపక్షం బారి నుంచి కాపాడుకుంటామని ప్రమాణం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలకు శశికళ సూచించారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఉన్నప్పుడు అమ్మగా ఆమె నుంచి పొందిన ప్రేమనే తన నుంచీ ఆస్వాదించాలని సూచించారు. ఈ లేఖ అన్నాడీఎంకే పత్రిక నమదు ఎంజీఆర్ లో ఈ రోజు దర్శనమిచ్చింది. అన్నాడీఎంకే ఉక్కు కోటను బద్దలు చేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు. పార్టీని కాపాడుకునేందుకు, పార్టీ ప్రేమ, ఆప్యాయతల కారణంగానే తాను ప్రజా జీవితంలోకి వచ్చానని చెప్పారు.