: జెండా పండుగను ఘనంగా చేసుకోండి.. కానీ జాతీయ గీతాన్ని ఆలపించొద్దు.. పిలుపునిచ్చిన ముస్లిం మతపెద్దలు!
స్వాతంత్ర్య దినోత్సవం నాడు మదర్సాలలో జాతీయ గీతాన్ని ఆలపించాలని, దానిని వీడియో తీసి పంపాలన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలపై మతపెద్దలు భగ్గుమంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని, అయితే జాతీయ గీతాన్ని ఆలపించడం కానీ, దానిని రికార్డు చేయడం కానీ చేయవద్దని ముస్లిం మతపెద్దలు పిలుపునిచ్చారు. ఇలా చేయడం ఇస్లాంకు పూర్తి వ్యతిరేకమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
రవీంద్రనాథ్ టాగోర్ అప్పటి బ్రిటిష్ రాజు 'జార్జ్-V'ని కీర్తిస్తూ ఈ గీతాన్ని రాశారని బరేలీ షెహర్ ఖాజీ మౌలానా అస్జద్ రజా ఖాన్ తెలిపారు. ఇస్లాం ప్రకారం తమ ‘అధినాయకుడు’ దేవుడని, జార్జ్ కాదని పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని అవమానించాలన్నది తమ ఉద్దేశం కాదని, అయితే తమ మత సిద్ధాంతాల ప్రకారం జాతీయ గీతాన్ని ఆలపించలేమని తేల్చి చెప్పారు. రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ కూడా జాతీయ గీతంపై అభ్యంతరాలను వెలిబుచ్చినట్టు రజాఖాన్ తెలిపారు.
షరియా చట్టాల ప్రకారం ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ ఇస్లాం వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఈ చట్టాలను ఉల్లంఘించమని చెబుతోందని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, ఆ రోజున జెండా ఎగరవేయాలని, ‘సారే జహాసే అచ్చా హిందుస్తాన్ హమారా’ అనే గీతాన్ని ఆలపించాలని, దేశం కోసం పోరాడి, ప్రాణత్యాగాలు చేసిన వీరులను గుర్తుకు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా రజాఖాన్ మదర్సాల నిర్వాహకులకు పిలుపునిచ్చారు.