: ఐక్యూలో ఐన్ స్టీన్ ని దాటేసిన బ్రిటన్ లో తెలుగు విద్యార్థి!
ప్రతిష్టాత్మక మెన్సా ఐక్యూ పరీక్షలో ఎన్ ఆర్ఐ విద్యార్థి బండి యశ్వంత్ అత్యధిక మార్కులు సాధించాడు. బ్రిటన్ లో నివసిస్తున్న యశ్వంత్ ఏడో తరగతి పాసయ్యాడు. వచ్చే నెలలో ఎనిమిదో తరగతిలోకి ప్రవేశించనున్నాడు. మేథస్సును పరీక్షించి సభ్యత్వం ఇచ్చే బ్రిటన్ కు చెందిన మెన్సా ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన ఈ పరీక్షకు యశ్వంత్ హాజరయ్యాడు. ఈ పరీక్షలో సాధించే అత్యధిక స్కోర్ 162. ఆ స్కోర్ ను యశ్వంత్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఐక్యూ పరీక్షలో ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ సాధించిన స్కోర్ 160.
ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ, సైన్స్, గణితం, అంతరిక్ష శాస్త్రం అంటే తనకు ఎంతో ఆసక్తి అని, పారిశ్రామికవేత్త కావాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. కాగా, యశ్వంత్ మాతృభాష తెలుగు. ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ భాషలు కూడా మాట్లాడగలడు. అతనికి కొంచెం లాటిన్ భాష కూడా తెలుసు. ప్రస్తుతం రష్యన్ భాష నేర్చుకుంటున్నాడు. యశ్వంత్ తల్లిదండ్రులు కృష్ణమోహన్, మాధవీలతలు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరు వీరి స్వగ్రామం.