: హుక్కా పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు!
హుక్కా కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ట్విన్ సిటీస్ కాఫీ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహిత్ కృష్ణయ్య ఆరోపించారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, స్మోకింగ్ జోన్ లో హుక్కా తాగడం సబబేనని కోర్టు చెప్పిందని, హుక్కా సేవించడం అక్రమమని ఎవరూ చెప్పలేదని అన్నారు.
కోర్టు తీర్పును ధిక్కరిస్తూ కాఫీ షాపులపై దాడులు చేసి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లినందుకు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పద్దెనిమిదేళ్లుగా ప్రజలకు హుక్కా సేవలు అందిస్తున్నామని అన్నారు. కొందరు వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే.. అందరినీ బాధ్యులను చేయడం సబబు కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.