: అబద్ధపు రోగాలే ఆమె పెట్టుబడి..అప్పనంగా సొమ్ము చేసుకుంటున్న ఓ మహిళ!
ల్యుకేమియా, లివర్ క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నానంటూ అబద్ధాలు చెప్పి అప్పనంగా డబ్బులు కొట్టేస్తున్న ఓ మహిళ సంఘటన తాజాగా వెలుగుచూసింది. అమెరికాలోని న్యూయార్క్ లోని వెస్ట్ చెస్టర్ కు చెందిన హుబ్రాజ్ (38) అనే మహిళ తాను ల్యుకేమియా, లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు పెట్టి నెటిజన్లను గత రెండేళ్లుగా మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటోంది. ఇప్పటివరకు 300 మందిని ఈ విధంగా ఆమె మోసం చేసింది. సుమారు 50 వేల డాలర్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా న్యూయార్క్ ఎఫ్ బీఐ ఇన్ చార్జ్ విలియం స్వీనే మాట్లాడుతూ, గత రెండేళ్లుగా పలు పేర్లు మార్చుకున్న హుబ్రాజ్ ఈ మోసాలకు పాల్పడుతోందని చెప్పారు. క్యాన్సర్ బాధితురాలిగా గుండు చేయించుకుని, తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఓ ఫొటోను హుబ్రాజ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి, ఆర్థిక సాయం చేయాలంటూ తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను పొందుపరిచేదని చెప్పారు.