: నంద్యాలను నాకివ్వండి... నేనేంటో చూపిస్తా: జగన్
నంద్యాల ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైకాపా తరఫున పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని, ఆపై అసలు సిసలైన అభివృద్ధి ఎలా ఉంటుందో తాను చూపిస్తానని వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న జగన్, ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబుకు నంద్యాల గుర్తుకు వచ్చిందని, ఇవే నిధులు అంతకుముందు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
పులివెందులతో సమానంగా నంద్యాలను చూసుకుంటానని, ఇక్కడి ప్రజలు తనకు బంధువర్గమని అన్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. నంద్యాలలో రోడ్డుకు రెండు పక్కలా ఉన్న ఇళ్లను పడగొట్టి అదే అభివృద్ధి అని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కేసీ కెనాల్ లో రెండు పంటలకు సరిపడా నీరు అందేదని, ఇప్పుడు ఒక్క పంటకూ నీరు రాని పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేసే చంద్రబాబు వంటి రాజకీయ నాయకులను వదిలే సమస్యే లేదని హెచ్చరించారు.