: ఇక క్రికెట్ జోలికి వెళ్లనంటే వెళ్లను: లలిత్ మోదీ
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ, ఇకపై తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ జోలికి వెళ్లబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో మూడు పేజీల డాక్యుమెంట్ ను పోస్టు చేసిన లలిత్ మోదీ, తన హయాంలో ఇండియాలో క్రికెట్ అభివృద్ధికి ఎంతో చేశానని తెలిపారు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కి నిధులివ్వకుండా బీసీసీఐ ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. వెంటనే ఆర్సీఏకు నిధులివ్వాలని డిమాండ్ చేశారు.
తాను ఇకపై ఏ ఫార్మాట్ క్రికెట్ లోనూ భాగం కాబోనని, తదుపరి తరానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఒకప్పుడు క్రికెట్ ఆడితే రోజకు కేవలం రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ ఆదాయం లభించేదని, ఇప్పుడది రూ. 100 కోట్లకు చేరిందని అన్నారు. ప్రపంచంలోని క్రీడా సీజన్ లలో ఐపీఎల్ ఆరో అతిపెద్ద స్థానానికి చేరిందని, దీని వెనుక తనుపడ్డ శ్రమ ఎంతో ఉందని తెలిపారు. కాగా, ఐపీఎల్ లో అవినీతి ఆరోపణలు వచ్చిన తరువాత లలిత్ మోదీ, ఇండియాను వదిలి లండన్ కు పారిపోయి అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే.